2015/03/18

అర్థం చేసుకోవడం సుళువే ఆకళింపు చేసుకోవడమే కష్టం..

EASY TO UNDERSTAND, BUT HARD TO DIGEST !
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

తేలికగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే , శరీర స్పృహని పోగొట్టాల్సినవి " బట్టలు !"

శరీరమనే భావనని మరిచిపోవడానికి బట్టలు వేసుకోవాలి...కాని నేటి భావదారిద్ర్యం వల్ల ఇప్పుడు దానికి పూర్తి విరుధ్ధంగా  జరుగుతున్నది...

నేటి బట్టలు వేసుకునే విధానం శరీర ప్రదర్శన (show) , ఆకర్శణ (attraction )  ప్రాతిప్రదికలుగా నడుస్తున్నది.
నేటి ఆహార్య విధానంలో దాదాపు హుందా తనం, సౌకర్యం రెండూ లోపిస్తున్నవి...

మనలో ఏమాత్రం సంస్కారం మిగిలి ఉన్నా , మన శరీరాన్ని కప్పే ఆహార్యం లోమూడు విషయాలు బయట పడాలి...

ఒకటి మన పరణితి ,
రెండవది మన వయస్సు,
మూడవది మన సంప్రదాయం..

ఇందులో ఏ ఒక్కటీ కనబడకపోయినా దానిని ఆహార్య మనరు.... వేషమంటారు!!.( "కపటము" లేదా "నాటకం" లేదా "మోసం"  అంటారు)

మొదటిది,

వాస్తవానికి వస్త్రాలు 'శరీరాన్ని' దాచవు ... 'నగ్నత్వాన్ని' దాస్తాయి. ఇది(ఆహార్యం) చూసే వారిలోని వికారాన్ని తొలగించడానికి ప్రతి ఒక్కరూ నాగరికతతో చేయాల్సి కనీస మైన పని.
1) ఆహార్యం, ధరించిన వారి మానసిక స్థితిని, స్థాయిని తెలియజేస్తుంది.
2) శుభ్రనైన, వర్ణ సుమేళనమైన (చొలౌర్ మత్చింగ్ ), నిరాడంబరమైన*, సధర్భోచితమైన, కాలనుకూలమైన , మరీ బిగుతుగా లేక మరీ వదులుగా లేని ఆహార్యం వారి పరిణతి తెలియ జేస్తుంది.
3) మాసిపోయిన , ముడుతలు పడ్డ , చిర్గిన , రంగులు సరిపడని, అంగాంగ ప్రదర్శనలు చేసే, సమయానికి అనుకూలం కాని, అసందర్భమైన ఆహార్యం వారి వారి అపరిణతిని తెలుపుతాయి.

రెండవది....
1) లేనిది చూపినా ఉన్నది దాచినట్టే అలాగే ఉన్నది దాచినా లేనిది చూపినట్టే ... ఇవి రెండూ కూడా కపటాన్ని(మోసాన్ని ) తెలియ జేస్తాయి.

2)కాబట్టి మన వయస్సు మన ఆహార్యం లో బయట పడాలి... దాని వలన మనం నిష్కపటులమౌతాం.
వయసుని దాచే అలంకారాలు అంతరంగలోని కపటాన్ని తెలియజేస్తాయి...అది ఏనాటికైనా ప్రమాదకరమే!

ఇక మూడవది
1) ఆహార్యం నాగరికతకి, సాంప్రదాయానికీ సంబందిచింది.. ఒక మనిషి సమాజంలో విజయవంతగా పుట్టి,పెరిగి నిలదొక్కుకో గలుగు తున్నాడంటే అతని వెనకాల ఎన్నో వందల తరాల అవిరళ కృషి త్యాగం వుంటుంది దానినే పరంపర అంటాం .
2) దానికి కృతజ్ఞత గా , దానిని అంతే విజయవంతంగా కొనసాగించడానికైనా మన ఆహార్యం లో సంప్రదాయం అవసరం. లేకపోతే అది జాతి-ద్రోహమౌతుంది*... అది కృతఘ్నత అవుతుంది.

నిజానికి తలిదండ్రులు ఈ విషయాలు పిల్లలకి చిన్నప్పుడే నేర్పించాలి , దురదుష్ట వశాత్తు పెద్దలు పిల్లల ఉద్ధరణ లో గడపాల్సిన విలువైన సమయాన్ని కోల్పోతున్నారు . ఏది ఏమైనా..

సంసారం లో పిల్లలు వ్యాపారంలో డబ్బు(పెట్టుబడి) లాంటి వాళ్ళు…
“నీతిగా సంపాదించాలి – మంచి కొరకు వినియోగించాలి …”
లేకపోతే అసలు వ్యాపారమే చేయకూడదు.
పిల్లలూ అంతే!…
“సదుద్దేశంతో కనాలి- సన్మార్గంలో పెంచాలి”
లేకపోతే అసలు పెండ్లే చేసుకోకూడదు!
(easy to understand, but hard to digest ! :( )

అంతే కాని, "బాధ్యత లేని బతుకులతో భావితరాలని బలి తీసుకోవడం బాధాకరం".

నిజమైన ఆహార్యం తో ప్రతి ఒక్కరూ సహజంగా, సరళంగా... నిష్కపటులు, పవిత్రులవుదురు గాక ...
స్వస్తి!!

-సత్య.(neelahamsa9@gmail.com)

2014/08/28

తెలుగు వారంతా నీ బిడ్డలే!

అంతరంగాన భాషా ఝరి లో
ఆశువు గా జారిన ప్రతి లలిత పదం 
నీ లాలనలో నా మనసుకు తెలుసు 
అది నీ మునివెళ్ళ తీయదనం..

మమతలు  నిండిన మసుల్లోన
మధుర సరాల మధువులు వొంపి 
పున్నమి నిండా వెన్నెల లాగా  
పెదాల నిండా పదాలు నింపి

అశేష జనాల హౄదయాలనేలి
మది పాలించి మనసు లాలించి
మనసు పలికే భాష -  మనసున్న భాష
అమ్మ నేర్పిన భాష - అమ్మైన భాష

ఇంకెన్ని జన్మలో చెప్పు జననీ
వేయి జనమలు గాని  నీ ఒడిలోనె పుడతాను
అవతారమెత్తితే చెప్పుతల్లీ
నా గారల బిడ్డగా  నిన్ను కంటాను

మాతలని కన్న ఓ భరత మాతా!
మా తెలుగు తల్లి ని చల్లగా చూడు...
ఏ చోటనున్నా తెలుగు వారే అంతా
నీ బిడ్డలే తల్లి,  చేరి కాపాడు....  


-సత్య 

2014/06/30

ఎడబాటని ఎవడన్నాడు...



--

ఎడబాటని ఎవడన్నాడు
కలిసున్నది మనమేనాడు
నీ గుర్తులు వెన్నెల వనమై
తోడొచ్చేదే నాతోడు ....

ఆ చిలకా ఈ గొరెంకా
కలిసున్నది అసలెందాక
ఏ కొమ్మన గడిపామో రేయి
ఆ తరువూ నేడేదింక .....

నిన్నెవరితో పోల్చుకునేది
నీలా మరి ఎవరుండేది
ఈ ఎండిన గుండెని తడిపి
నన్నెవరు బ్రతికించేది....

ఆకాలం అయిపోయింది
ఆవేదనే వరమైయ్యింది
నువ్ చేసి వెల్లిన గాయం
అరచేతిన బరువైయ్యింది...

ఈ గాయానికి అన్నీ తెలుసు
చెబుతున్నా వినదీ మనసు
నడివీధిలో ఇపుడే ఎందుకు
గుంపు లో నువ్ గుర్తొచ్చేది ...

వేదనవై వదలవు చేయి
నాదారిన నన్నొదిలేయి
సరికొత్తగ ముందున్నదిగా
నాప్రేమని నాకిచ్చేసెయ్యి ....

-సత్య

2014/04/17

సగటు పాఠకుడికి కవితా సాహిత్యం లో నాన్యత కావాలి ...

                  "సగటు పాఠకుడు"... సగటు స్థాయిలో ఉంటాడు.. ఇప్పుడు జనాల మీదికి తోలుతున్న సాహిత్య మంత కింది స్థాయిలో కాకుండా, ఒకప్పటి పురాతన సహిత్య మంత గొప్ప స్థాయి లో కాకుండా  మధ్యలో సగటుగా నాన్యమైన సాహిత్యాన్ని ఆశిస్తూ ఉంటాడు...ఇప్పటి సాహిత్యం లో నాన్యత లేదు లేదు లేదు ...   

** కవిత్వమంటే ఛంధోబద్ధ కవిత్వం మాత్రమే అని ఎవడూ అనడు… వచన కవిత్వం అత్భుతమైన సాహితీ ప్రక్రియ... అందులో ఎలాంటి సందేహమూ లేదు… సాహిత్యానికి కవి పరాకాష్ట!... పాఠకుడు ద్రష్ట!! 

** ఇక్కడ కూడా పరిణతి ఉంటుంది... దానికి “మునిగి, తేలాలి! లోతు తెలుసు కోవాలి”!!... సాహిత్యం లో మునగడం సాధన!, సాహిత్యం లో తేలడం జ్ఞానం! సాహిత్యం లోతు తెలుస్కోవడం “పరిణతి”!!... అది ఇప్పటి నవ-కవుల్లో ఎక్కడా కనబడడం లేదు... 

** అదే ఒక చిన్న దశావధాని కూడా అవధానానికి పూర్వం రెండు లక్షల పద్యాలని కనీస అధ్యనం చేసి ఉంటాడు...కనీసానికి కనీసఒ 70 వేల గ్రాంధిక పదకోశాగారాన్ని మదిలో నిల్పుకొని ఉంటాడు... కఠొర శ్రమ చేసి ఉంటాడు... అల్లాంటి అధ్యయనం మన నవీన కవులు ఎందుకు చేయరు?అసలు ఎందరు చేసారు? (వేల్ల మీద లెక్క పెట్టే కొందరు తప్ప) .... ఇదే “ప్రమాణం”!!!


** భాష కూకటి వ్రేళ్ళతో కునారిల్లుతున్నదని బాధ పడే వారే ," పదాల పేదోడిగా" పరభాషా పదాలని విర్విగా వాడడం పరిణతి లోపం కాదా? 

** భావాలని అందంగా రాసి, ఆ పేరాలని/రాతలని ముక్కలు ముక్కలు గా చేసి కవితలు గా చెప్పుకుంటున్నారు... ఇంతకన్నా దౌర్భాగ్యం భాషాతల్లికి ఏముంటుంది?.. 

** లోతైన భావాలతో సహా లోతైన భాషకూడా చాలా అవసరం!!. భాషా-భావాల సమతూకం అవసరమే,అదే ఉన్నింటే ఇన్ని విషయాలు చర్చకొచ్చేవే కావు.సాహిత్యం పదాలని సమతూకం తో సమయోచితంగా ధర్భోచితంగా వాడే వాళ్లు మనచుట్టూ చాలానే ఉన్నారు... 

** బయటి సాహితీ పుస్తకాల్లో, సహితీ సేవా సంస్థల్లో, సాహితీ వెబ్‌సైట్లల్లో ప్రచురించే కవితలన్నీ దాదాపు గా పరిచయాల ప్రభావాలే తప్ప నిజమైన కళా వేట జరగడం లేదు..(వేళ్ల మీద లెక్కపెట్టే కొన్ని తప్ప ) 

** కవులని తయారు చేయడం కుదరదు... అది జరగని పని . కవులని (ఏ కళాకారులనైనా) తయారు చెయలేము వారు సహజంగా పుడతారు వారు దాన్ని గుర్తించి సాధన ద్వారా సాన పెట్టుకోవాలి.. ఆతర్వాతే కలం పట్టుకోవాలి అంతే!...వారిని సద్విమర్శ చేసిన వారికి, ప్రోత్సహించినవారికి సాహిత్య లోకం సదా కృతజ్ఞతతో ఉన్నది/ఉంటుంది.. 

** కాని పాఠకులని మాత్రం తయారు చేయాలి ప్రోత్సహించాలి, వివరించాలి, విశధపరచాలి,మంచి సాహిత్యాన్ని సౌలభ్యం తో ముందు ఉంచాలి... 

** అచ్చు వేసుకున్న పుస్తకాలని అమ్ముకోవడం కోసమే, నాతో పరిచయం చేసుకొని... అంటగట్టి... ముఖం చాటేసిన వాళ్లూ ఉన్నారు…
అచ్చు వేసి అమ్ముకోలెక అవస్థని అనుభవించాల్సిన అగత్యం కవికి ఎందుకు దాపురించింది...? … (సాహిత్యాన్ని వ్యాపార వ్యవహారాల్లో ఇరికించడం )

** వాదాలకి,కులాలకి, మతాలకి, సిద్ధాంతాలకి, రాజకీయాలకి, రభసలకి, దాడికి, నవీన సాహిత్యాన్ని ఓ పావుగా వాడుకుంటున్నారు కొందరు ... ఇది ఇంకో దౌర్భాగ్యం..ఉసిగొల్పడం,రెచ్ఛగొట్టడం, అశాంత పరచడం,అయోమయ పరచడం, దారి మళ్ళించడం, ద్వేషం నింపడం ఇవే వారి పనులు ... ఇది స్పష్టంగా కనపడే జ్ఞాన లోపం. శాంత పరచడం, స్వాంతన నివ్వడం, సమాధాన పరచడం, దారి చూపడం, ప్రేమ పంచడం చాలా కొద్ది మందే చేస్తున్నారు… 

** భాషా ప్రాభవాన్ని తగ్గించి,ఓ మెట్టు దిగజార్చి... సౌలభ్యం, సౌకర్యం, సరళత్వం అని పెట్టిన పేర్లు చాలు!... పాఠకుడు ఎప్పుడూ నాన్యతనే కోరుకుంటాడు.  

** అయినా ఈ భాధంతా పాఠకులది...రాతలు రాసి జనామీది తోలేవాళ్ళది కాదు...

** మొత్తం మీద మిఠాయిలు చేయడం రాక , మిఠాయిల పేర్లు తెలుసుకోక, న్యూనత తో   "నేరుగా చక్కెర బుక్కితే చాలు ఇన్ని మిటాయిలెందుకు?" అనే వాళ్ళకి తీపి ఒకటే అయినా మాధుర్యాలు వేరు అని   ఎప్పుడు తెలిసేది ?   

** జనం కోసం,చైత్యన్యం కోసం మార్పుకోసం ఇప్పుడు వస్తున్న్న నవీన సాహిత్యం పామరునిపై ఒకప్పటి సుమతీ-వేమన-నార్ల  శతకాలంత ప్రభావం ఎందుకు చూపలెకపోతుంది?...సుమతీ-వేమన శతకాలంత బాగా నవీన కవితా -సందేశాలు ఎంతమంది కి గుర్తున్నాయి?...ఎంతమంది నోటిలో నానుతున్నాయి? అసలు, పామరున్ని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు...అయితే సగటు పాఠకుడు రోగి-స్థాయిలో ఉన్నాడంటారా?  

** అందనిది అర్థం కానిది, ఇంకా చేతకానిది, చాదస్తమే కొoదరికి !    వీరెప్పుడూ ఆస్థాయిలోనే ఉంటారు మారరు !

-satya 

Note: *** above points are not applicable to all … I just want to say that, if It is inappropriate,if they hurt anybody, I would like to express my deep regrets for it, and apologize for my points. but I don't think so! ..