2013/06/21

ఏడవాలని ఏడిస్తే ఎలా వుంటుందో ...


కరిగే  హృదయం ఏక్కడోచోట  ఉండకా పోదు ...

హృదయం  ఎక్కడోచోట కరగాకా పోదు ... 

అది  కవితై పారకా పోదు! 

కాని,

ఇక్కడో విషయం  చెప్పుకోవాలి .. రాయాలని పెన్నుపట్టుకు రాస్తే అది కవితనిపించుకోదేమో ...

కరిగిన తరువాత కలం పట్టుకోవాలే  కాని, 
కలం పట్టుకొని కరిగించ కూడదేమో... 
సహజ ధార ... సరళ ఝరి... లేక పోతే అది కవిత కాదేమో 

మీరన్నట్టుగానే ఒకప్పుడు సమయానుసారంగా స్పందించి చూసాను 
రచనలైతే వచ్చాయి కాని, అసహజంగా ఉన్నాయి... కవితలు కాదనిపించుకున్నాయి 
నా అనుభవమైతే నాకదే నేర్పింది!! 

మదర్స్ దే అని, స్నేహితులరోజని, పిచ్చుకల రోజనీ, రోజాల రోజనీ, 
ఇలా స్పందిస్తూ పోతే అనిపించింది, నేనేమి కోల్పోయానో...

నవ్వాలని తెచ్చుకున్న నవ్వులా ఉండింది ... 

కావాలని, ఏడవాలని ఏడిస్తే ఎలా వుంటుందో అల్లా ఉండింది...

మనసు కరిగి సహంజంగా వచ్చేది నిజంగా మన మనసులని కూడా కరిగిస్తుంది.

అల్లాంటి కవితల కోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాను.. 

పెద్దలు, తప్పులుంటే మన్నించి సరిదిద్దాలి... 

-సత్య
॥ స్వస్తి ॥ 

2013/06/13

ఫలాల సంచి...


తెలీకుండా దొంగలా 
దూరిందీ అహంకారం
నాకు తెలీకుండా నన్ను
మంది చూపుల్లో ఉంచింది

మందికి అతికించి
మందిలో బ్రతికించి
నాలో నేను గడిపే కాలం , 
ఇంకో విజయాన్ని దూరం చేసింది

గునపంలా గుచ్చి 
గుణపాఠాన్నిచ్చి 
నిరాశా నిట్టూర్పుల 
నీతుల్ని నిలిపింది 

మౌనం దాటిన మాట
ముల్లు గా గుచ్చుతుంటే 
ఫలాల సంచికి
ఇంకో చిల్లోటి పడింది 
-సత్య