పెద్దలందరికీ నమస్కారాలు.
అంధ్రప్రభలో (http://www.andhraprabha.com/) ' బ్రహ్మర్షి నారదుల ' పై నా చిన్న వ్యాసం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా.
-సత్య
నారాయణ అంటే (నార+ ఆయణ ) సృష్టి తానై సృష్టంతా వ్యాపించినవాడని అర్థం. ముల్లోకాలలోనూ ఆయన అస్తిత్వాన్ని, ప్రేరణని, రక్షణని, నియమాన్ని, ప్రభుతని, ఆయన లీలా విభూతులని, వెతుకుతూ, దర్శిస్తూ, అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, పులకితుడై నారాయణా నారాయణా అని పలికే పరమోత్కృష్ట భక్తి తార్కాణ స్వరూపం శ్రీ నారద మహర్షి.
నారద మహర్షి ముల్లోక సంచారం నారాయణుని విష్ణుత్వానికి(వ్యాపకత్వం) ప్రతీక. మన పురాణేతిహాసాలలో పరమాత్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యాల నాంది నారదులవారి ద్వారానే పలికించడం మనం గమనిచవచ్చు.
బ్రహ్మ తన సృష్టి సామర్థ్య రహస్యాన్ని తానే తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే బహుశా నారదుడిగానే మారతాడేమో. అందుకనేనేమో బ్రహ్మ మానస పుత్రుడిగా నారదుడు అవతరించాడు.
భక్తులు ఎప్పుడెప్పుడు కష్టాలలో ఉన్నా, అక్కడక్కడ చేరి ప్రత్యక్షమై వారిని రక్షించడం, ఆప్తవచనాలు పలకడం, హెచ్చరించడం, ఆదుకోవడం, ఉద్ధరించడం, జ్ఞాన బోధ చేయడం, ప్రేరణ కలిగించడం పురాణేతిహాసాలలో మనం తరచుగా చూస్తూంటాం. ఇప్పటికీ అధ్యాత్మిక సాధనలో ఎందరో సాధకులకి నారద మహర్షులవారు ధ్యానంలో దర్శనమివ్వడం ఓ మెట్టుగా పెద్దలు భావిస్తారు. ఆ దర్శనాన్ని గొప్ప శుభ సూచకంగా నిర్ణయించారు. పురుష, లీలా, గుణ, మన్వంతర, యుగ, శక్త్యావేశ అవతారాలని ఆరు రకాల అవతారాలను భగవంతుడు దాలుస్తుంటాడు. శ్రీ హయగ్రీవ, ధన్వంతరీ, వ్యాస, వృషభదేవ అవతారాల లాగానే 23 రకాల లీలావతారాలలో బ్రహ్మర్షి నారద అవతారమొకటి. సాక్షాత్ విష్ణుస్వరూపం! బ్రహ్మచారి, లోక సంచారి, వేద విహారి, సంగీత-గాన-బ్రహ్మ అయిన నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు.
మన ఇతిహాసాలలో రామాయణ మహాభారత భాగవతాలని పరంపరగా, పావన గ్రంధాలుగా, పామరులకందిచడంలో ఆయా మహర్షులకి పరిపూర్ణ ప్రేరణ కల్గించినవాడు నారద మహర్షుల వారేనని మనకి ఆయా నాంది ప్రస్తావనల ద్వారా తెలుస్తున్నది. దారి తప్పి పోయిన బోయవానికి హితవుచెప్పి, తపస్సుకి ఉపక్రమింపజేసినపుడు, తను మహర్షిగా ఎప్పుడు మారాడో కూడా తెలియని ఆ బోయవాడు, తన ఎదుటే మిథునంలోని క్రౌంచ పక్షిని వధించిన నిషాదున్ని శపించి, తిరిగి మనో వ్యాకులత పొందితే, ఆ బోయవాన్ని(వాల్మీకి మహర్షిని) సమీపించి అది శాపము కాదని, శుభప్రద రామాయణానికి మొదటి మంగళ శ్లోకమని, అది భగవత్ప్రేరణ అని వివరించి, శాంతింపజేసి ... శ్రీమద్రామాయణాన్ని రచింపవలసిందిగా ఉపదేశించి, వాల్మీకి మహర్షిని ఉద్ధరించినది శ్రీ నారదుల వారే.
మా నిషాద ప్రతిష్ఠాంత మగమ శ్శాశ్వతీస్సమాయత్క్రౌంచ మిథునా దేక మవథీ కామమోహితం !!
భగవత్ప్రేరితంగా వచ్చిన ఈ శ్లోకం, ప్రపంచ చరిత్రలోనే మొదటి కవిత!! శ్రీమద్రామాయణం మొదటి కావ్యం (ఆది-కావ్యం)!!
శ్రుతి పరంపరగా, ఏకసముదాయముగా ఉన్న వేదాలని సంగ్రహించి, విభజించి, గ్రంధస్థం చేసి, సనాతన సంస్కృతికి ఎనలేని సేవ చేసిన శ్రీవ్యాసమహర్షి, ఇంత చేసిననూ ఇంకా అంతరంగంలో పూరించలేని వెలితిని పొందగా, వారి నిర్లిప్తతని పోగొట్టి, జ్ఞానోపదేశం చేసి, మహాభారతాన్ని పంచమవేదంగా లోకానికి అందించవలసిందిగా ప్రేరణోపదేశం చేసినవారు శ్రీ నారదులే.
సప్తదిన సమీపాన ఉన్న మృత్యువుని చూసి భయం పొంది, కంపితుడైన పరీక్షుత్తుకి జ్ఞానోపదేశం చేసి, తనలోని అశాంతియుతమైన కలిని దూరంచేసి, భాగవత-సప్తాహం చేయమని, శ్రీ శుకమహర్షుల వారిచే వినమృడవై భాగవతాన్ని శ్రవణం చేయమని హితోపదేశం చేసి, పరీక్షిత్తు మహారాజుని మృత్యుముక్తున్ని చేసినది శ్రీ నారదుల వారే. అక్కడి నుండే మనకి శ్రీమద్భాగవతం లోక విదితమైంది.
అల్పాయుష్కుడైన మార్కాండేయుడికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి యముని యమపాశం నుండి విముక్తున్ని చేసి శివకైవల్య సాన్నిధ్యాన్ని ప్రసాదించిన వారు నారదులు. తండ్రీ, సవతి తల్లి ద్వారా అనాదరణ పొందిన పసిబాలుడైన ధ్రువునికి శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసి సాక్షాత్ నారాయణుని అంకసీమని (ఒడిని) లభింపజేసి, ధృవతారగా నిల్పిన పావన చరితుడు నారదుడు.
చూలాలైన హిరణ్య కశపుని సతియైన లీలావతిని ఇంద్రాదుల ద్వారా రక్షించి, తనకీ తన గర్భంలోని ప్రహ్లాదునికీ నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి ఉధ్ధరించి విష్ణుసాక్షాత్కారాన్ని అదించిన దయామయుడు నారదుడు. మార్కాండేయుడుకి శివ పంచాక్షరీ కాని, ధృవుడికి వాసుదేవ ద్వాదదశాక్షరీ కాని, ప్రహ్లాదుడికి నారాయణ అష్టాక్షరీ కాని, ఇల్లాంటి మంత్రరాజాలనెన్నింటినో పరమ ప్రేమతో ఉపదేశించిన ఘనత నారదుల వారికే దక్కుతుంది, ఇందుకు యావత్ సనాతన ధార్మికులు వారికి కృతజ్ఞులై వుండాలి.
జీవితంలో ఆర్తుల మాయ, అజ్ఞాన, నైరాశ్యాలని తొలగించి, భక్తి బీజాలు నాటి, జ్ఞానవైరాగ్యాలు పెంపొందించి ఉద్దరించి, మోక్ష-ఫలాలనిచ్చి పరమాత్మ ఒడిని, పరమపదాన్ని చేర్చడం నారదుల వారి అవ్యాజ ప్రేమ తత్వం. వారు ఎక్కడికేగినా, ఎవ్వరితో మాటాడినా, ఏం చేసినా అది లోక కళ్యాణానికే!
భాగవత భక్తుల సేవ భగవంతుని సేవ కన్నా గొప్పది, అది చేసి చూపిన వారు నారదులు. భగవద్లీలని సాకారం చేయడం నారదుల వారి ముఖ్య లక్ష్యం. యుగ యుగాలు దాటినా వారి అస్తిత్వంలో ఏమాత్రం మార్పు వుండదు. బహుశా చిరంజీవేమో. ప్రహ్లాదుని నుండి పరీక్షిత్తుని వరకు, భక్తులని ఓ కంట కనిపెడుతూ ఉద్దరిస్తూ ఉండే దయామయుడు నారదుడు.
పరమ పావన పురాణ పురుషులని, పాత్రలని, సన్నివేషాలని గేలి చేయడం, ఆట పట్టిచడం, అవహేళన చేయడం, వినోద-వ్యాపార వస్తువులుగా మార్చడం మనకు మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకా తేరుకోకుండా నిస్తేజులవడం, ప్రశ్నించక పోవడం, మన నిర్లక్ష్య-భస్మాసుర-హస్తమే అవుతుంది.
నారం దదాతి ఇతి నారదః – అనగా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడు అని అర్థం. ఇప్పటికీ నారదులవారందిచిన నారద-భక్తి-సూత్రాలు సాధకులకి వారి భక్తిని పరీక్షించుకోవడానికి ప్రమాణాలు, సులభ మోక్షసోపానాలు. సా తస్మిన్ పరమప్రేమరూపా! (నారద భక్తి సూత్రం-2) భగవంతునిపై పవిత్రమైన ప్రేమ రూపమే భక్తి!
జఠాధారియై, వ్యాఘ్రాజీన, కమండలాలతో, మహతీ అనే వీణాధారియైన శ్రీబ్రహ్మర్షి నారద భగవానుడు మన మనో మస్తిష్కాలని ప్రేమమయం భక్తిమయం విష్ణుమయం చేయుగాక!
స్వస్తి!
|| జై శ్రీమన్నారాయణ ||