2014/03/03

బిడ్డకి తల్లితో ఉండే సౌలభ్యతే విగ్రహారాధన ...

                          || జై శ్రీమన్నారాయణ ||
ఇంటీవల ఆంధ్రప్రభ వెబ్-పత్రికలో వచిన విగ్రహారాధన పై నా వ్యాసం:
http://www.andhraprabha.com/spirituality/all-religions-based-on-vigraharadhana/13224.html#.UxNSd3ek1W4.facebook


భద్రాచల సీతారామలక్ష్మణుల మూల విగ్రహం
ఒక బిడ్డకి తన తల్లి, తన పాఠశాలలోనే ఉపాధ్యాయినిగా పనిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు భక్తునితో పరమాత్మ. పాఠశాల సమయమంతా బాధ్యతతో ఉపాధ్యాయినిగా ఉన్నా, తల్లి తన బిడ్డని మాత్రం అమ్మగానే కనిపెట్టుకుని ఉంటుంది. తనకేమన్నా అయితే మాత్రం అన్నీ మరిచి వెంటనే అమ్మైపోతుంది, ఆదుకుంటుంది, అప్పుడు ఆ విషయం మనకు అర్థమౌతుంది. పరమాత్మ కూడా అంతే. దీనినే సౌలభ్యత అంటారు. ఇది పరమాత్మ అనంత కళ్యాణ గుణాలలో ఒకటి.
పనుల్లో, బాధ్యతల్లో అమ్మ అనేక రూపాలలో ఉంటుంది, ఎక్కడ ఎలా ఉన్నా బిడ్డకి అమ్మ అమ్మలాగే కావాలి. సృష్టి, స్థితి, లయలలో, భగవంతునికి ఎన్ని రూపాలున్నా తనకి అత్యంత సౌలభ్యమైన సౌకర్యవంతమైన దగ్గరైన రూపంలో భగవంతుడు భక్తుల కోసం ఉంటాడు. అలాంటి ఊతాన్నే, అలాంటి రూపాన్నే భక్తుడు కోరుకుంటాడు. ఇక్కడి నుండే బయలుదేరుతుంది విగ్రహారాధన. రూప్యోపాసన, సగుణోపాసన, ప్రతిమోపాసన, సాకారాధన, అర్చారాధన, విగ్రహారాధన ఇలా ఎన్నో పేర్లు.
ఎన్నో మతాలలో ప్రత్యక్ష విగ్రహారాధన లేకపోయినా ప్రతి మతంలో ప్రతీకాత్మక ఆరాధన జరుగుతుంది. ఇది కాదనలేని సత్యం. నిర్వికారుడైన, నిరాకారుడైన పరమాత్మకి రూపం ఎలా వుంటుంది అనేది విగ్రహారాధనని నమ్మని వారి వాదన. సర్వశక్తిమంతుడు, ప్రేమమయుడైన పరమాత్మ అన్నీ చేయగలిగిన వాడై ఉండి రూపం మాత్రం ఎందుకు దాల్చలేదు అన్నది ప్రతిమోపాసకుల వాదన.
తాదాత్మ్యత పొందడానికి, ఏకాగ్రత-శ్రద్ధ పెరగడానికి, ప్రతిమోపాసన ఉపయోగ పడుతుంది అని కొందరు ఆస్తికుల వాదన. అలాగే నిర్గుణుడైన పరమాత్మని చేరడానికి సగుణోపాసన ప్రాథమికంగా దారి వేస్తుంది అనేది ఇంకొందరి వాదన. కాని విగ్రహా రాధన ప్రాథమికమైనదే కాదు, ప్రధానమైంది కూడా అని, అది మోక్షసోపానమని ఆళ్వారులు, ఇంకా భక్తి ఉద్యమకారులైన చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, సూర్‌దాస్, మీరాభాయి, కబీర్, తులసీదాస్, రవిదాస్, జ్ఞాన్‌దేవ్, నామ్‌దేవ్, తుకారామ్ వంటి వారు సశాస్త్రీయంగా నిరూపించారు.
సర్వవ్యాపకుడైన పరమాత్మ విగ్రహంలో మాత్రం ఎందుకు ఉండడు? ఇది అధ్యాత్మిక కోణమే కాదు తాత్విక కోణం కూడా. జగమంతా నిండిన విష్ణువు నుండి, శ్రీరంగ వేంకటాచల క్షేత్రాల నుండి, మన గ్రామ ఆలయాల నుండి, ఇంట్లో పెట్టుకునే చిన్ని అర్చా మూర్తి వరకూ, భగవంతుని కృపా సౌలభ్యమే విగ్రహారాధన.
ఇది దారే కాదు గమ్యం కూడా. విగ్రహారాధనలో ఎంత సౌలభ్యం వుంటుందంటే ప్రాపంచికమైన విషయాలని మాత్రమే గ్రహించగల ఇంద్రియాలు సైతం ఇందులో సంతృప్తి పొందుతాయి. మనో నిగ్రహానికి, ఏకాగ్రతకి, శ్రద్ధకి, విశ్వాసానికి, అంతర్ముఖులు కావడానికి, మొదలగు ప్రాపంచిక విషయాలే కాకుండా భక్తి, జ్ఞాన, వైరాగ్య, మోక్షాలు కూడా విగ్రహారాధనతో పొందవచ్చును.
అమ్మకి బిడ్డతో ఉండే అనుబంధమే సృష్టితో పరమాత్మకి వుంటుంది. కాబట్టి పరమాత్మ లీలా విభూతుల ఆనవాళ్ళు సృష్టిలో తప్పనిసరి. దానికి సంబంధించిన ప్రతీక-ప్రతిమోపాసనే మన సంప్రదాయం!. ప్రతిమోపాసనతో ఆ దివ్యపురుషుని లీలలు, గాథలు, బోధలు మనసున నిల్పుకోవడం, మననం చేసుకోవడం, ముక్తులమవడం సులభతరమౌతుంది. 
దైవం తప్ప ద్వైతం లేదని చెప్పే ఆది శంకరులు కూడా విగ్రహారాధననే సూచించారు. గోవిందుడి నుండి శివ, శక్తి, సుబ్రహ్మణ్యుని వరకు తను చేసిన మహిమాన్విత అద్భుత స్తోత్రాలే అందుకు నిదర్శనం. చరిత్రలోనే మొట్టమొదటిసారి దళితులకి ఆలయప్రవేశం కల్పించి, రహస్యమైన నారాయణ మంత్రాన్ని గోపురమెక్కి జనులందరికీ ఎలుగెత్తి పంచి, లక్షలాది మందిని ప్రభావితం చేసిన భగవద్రామానుజుల విప్లవ చైతన్యానికి విగ్రహారాధనే పునాది. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, వైష్ణవ, శైవ, శాక్తేయ, గాణాపత్య, పంచాయతన.. ఇలా సనాతన ధర్మంలోని ఎన్నో మతాలకి పునాది విగ్రహారాధనే.
ఆచారాన్ని పెద్దల మాటని నమ్మి ఆచరించే వాడు కారణ-హేతువులని పెద్దగా ఆలోచించడు. ప్రభాత సమయంలో సింహంలా లేచిన రాముడు, 'ఈ అడవిలో మనం ఎటువైపు వెళ్లాలి?' అని గురువు విశ్వామిత్రుడిని వినయంతో ప్రశ్నిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు,"ఏష పంధా మయొద్దిష్ఠో ఏషయాంతి మయర్షయ:", మహర్షులు ఏ దారిలోనైతే వెళ్ళారో అదే దారిలో మనమూ వెళ్లదుము గాక అని చెబుతాడు.   
స్వస్తి.

: వీరమూర్తి

|| జై శ్రీమన్నారాయణ ||

1 comment: