2015/03/24

ఈమెవరో మరి...

ఈమెవరో మరి.
^^^^^^^^^^^^
(23-03-15)
చల్లని చూపులు వెచ్చని ఒడి
కన్నుల నిండిన వెన్నల తడి
ఇప్పుడు ఈమెలో లేవు
ఇప్పుడున్నది ఈమెవరో మరి.

అలుపెరుగని అవసరాల పోరాటంలో
ప్రదర్శణా ప్రపంచ స్త్రీరూపం! ఈమెవరో మరి.

తను చిన్నపిల్లల గుడ్డలేసుకుని
తన పసిపాపకి మాత్రం పెద్దోల్ల బట్టలేసి
జబ్బలు లేని కిటికీల డ్రెస్సులు వేయించి
విందులకై మందిలో తిప్పుతున్నది . ఈమెవరో మరి.

నెలల తరబడి బిడ్డకి డాన్సులు నేర్పించి
జనాల మధ్యలో జరిగిన ఐటెంసొంగ్ డాన్సుకి
పొంగి పోయి అందరితో కలిసి గొప్పగా
చేవ తెచ్చుకొని చప్పట్ట్లు కొడుతున్నది. ఈమెవరో మరి.

పనులన్నీ పక్కనపెట్టి
ముచ్చటగా ముస్తాబయ్యి
టివీ ప్రొగ్రాం ఆంకర్ కోసం
అద్దం ముందు ఆత్రంగా ఎదురు చూస్తున్నది.ఈమెవరో మరి.

తన్వు ప్రదర్శించి, ఆకర్శించే దుస్తులు వేయించి,
సంకోచం బిడియం విడువమని
"ఏ ప్రమాదమూ" ఉండదనీ
ఎర్రని కళ్లతో హెచ్చరిస్తున్నది. ఈమెవరో మరి.

తను కావలనుకొని కాలేక పోయిన
కరగని కోరికల దుగ్దలని
శ్రద్ద తీసుకొని, ప్రణాలికా బద్దంగా
పసి మనసులపై రుద్దుతున్నది. ఈమెవరో మరి.

అక్షరాలు ఆర్తిగా అందకముందే
అవసరంలేని అస్థిత్వాన్ని ఆపాదించి
అంబరమంటే అహాన్ని అంటగడుతూ
అక్కరకిరాని అందలమెక్కిస్తున్నది. ఈమెవరో మరి.

-సత్య

No comments:

Post a Comment